Iran: ఇరాన్-అమెరికా శాంతి చర్చలు... దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలతో కళకళలాడాయి. శాంతి చర్చలతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చన్న సానుకూల అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఈ సానుకూల పరిణామాలతో అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి, సెన్సెక్స్ 787 పాయింట్లు లాభపడి 74,106.85 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, నిఫ్టీ 255 పాయింట్లు వృద్ధి చెంది 22,968.25 వద్ద ముగిసింది.

అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలకు ముగింపు పలికేందుకు ఒక ప్రతిపాదన సిద్ధమైనట్లు వచ్చిన నివేదికలు మార్కెట్లకు ప్రధాన ఊతమిచ్చాయి. రెండు దశల్లో ఈ ఒప్పందం కుదరనుండగా, 15 నుంచి 120 రోజుల్లో తుది కాల్పుల విరమణ ఒప్పందంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు కార్యక్రమాలపై పరిమితులు, ఆంక్షల ఉపశమనం వంటి అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ మార్కెట్లు స్థిరపడతాయని, ముఖ్యంగా ఇంధన ధరలు అదుపులోకి వస్తాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

టెక్నికల్ పరంగా చూస్తే, నిఫ్టీ కీలకమైన 23,000 స్థాయికి చేరువలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్థాయిని అధిగమించి స్థిరపడితే, 23,200 వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, 22,800 - 22,750 జోన్ తక్షణ మద్దతుగా పనిచేస్తుందని, 22,550 వద్ద బలమైన మద్దతు ఉందని నిపుణులు విశ్లేషించారు.

నిఫ్టీలో ట్రెంట్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టైటాన్ కంపెనీ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. కన్‌స్ట్రక్షన్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.52 శాతం, స్మాల్‌క్యాప్ 1.29 శాతం మేర లాభపడ్డాయి. అయితే, ముడి చమురు ధరల్లో అస్థిరత కారణంగా ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాత్రం కొంత వెనుకబడింది.


Iran
Iran US talks
US Iran deal
Stock market
Sensex
Nifty
Crude oil prices
Geopolitical tensions
Indian stock market
Share market

More Telugu News