Election Commission of India: అసెంబ్లీ ఎన్నికల వేళ... ప్రింట్ మీడియా యాడ్స్‌పై ఈసీ కఠిన నిబంధనలు

Election Commission of India Issues Strict Rules for Print Media Ads During Assembly Elections
షార్ట్స్‌లో చూడండి
మరికొన్ని రోజుల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారాన్ని స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో ప్రింట్ మీడియాలో ఇచ్చే రాజకీయ ప్రకటనలపై కఠిన నిబంధనలు విధించింది. పోలింగ్ రోజు, దానికి ఒక రోజు ముందు ఇచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది.

ఈ నిబంధనల ప్రకారం, రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలోని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి లేదా సంస్థ ప్రకటనలు ప్రచురించకూడదు. వ్యక్తిగత అభ్యర్థులు, ఇతరులు జిల్లా స్థాయి ఎంసీఎంసీని సంప్రదించాల్సి ఉండగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు రాష్ట్ర స్థాయి ఎంసీఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. ప్రకటన ప్రచురించాలనుకుంటున్న తేదీకి కనీసం రెండు రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాల్లో ఈ నిబంధనలు నిర్దిష్ట తేదీల్లో అమల్లోకి రానున్నాయి.
అస్సాం, కేరళ, పుదుచ్చేరి: ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఇచ్చే ప్రకటనలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
తమిళనాడు: ఏప్రిల్ 23న పోలింగ్ ఉండటంతో, ఏప్రిల్ 22, 23 తేదీల్లో యాడ్స్‌పై ఆంక్షలు ఉంటాయి.
పశ్చిమ బెంగాల్: తొలి దశ (ఏప్రిల్ 23 పోలింగ్)కు ఏప్రిల్ 22, 23 తేదీల్లో, రెండో దశ (ఏప్రిల్ 29 పోలింగ్)కు ఏప్రిల్ 28, 29 తేదీల్లో ప్రీ-సర్టిఫికేషన్ తప్పనిసరి.

ఈ కమిటీలు కేవలం ప్రకటనల పరిశీలనే కాకుండా, మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్ (చెల్లింపు వార్తలు) పైనా కఠిన నిఘా ఉంచి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

ఇదిలా ఉండగా, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే యత్నాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భారీగా అక్రమ సొమ్ము, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) ప్రారంభమైన ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ. 651.51 కోట్లకు పైగా విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
Go Back to Shorts
Election Commission of India
Assembly Elections 2024
ECI Guidelines
Print Media Ads
Political Advertisements
Media Certification and Monitoring Committee
MCMC
Pre-approval
Paid News
Election News

More Telugu News