JC Asmith Reddy: సీఎం చంద్రబాబు సమక్షంలో జేసీ అస్మిత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం... వివరాలు ఇవిగో!

ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ప్రాంత రైతుల పాలిట అపర భగీరథుడు, ఆపద్బాంధవుడు అని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కొనియాడారు. కేవలం మాట ఇచ్చి, ఎలాంటి జీవోలు లేకుండానే తాడిపత్రి నియోజకవర్గానికి సాగునీరు అందించి రైతుల కన్నీళ్లు తుడిచారని ఆయన భావోద్వేగంతో ప్రశంసించారు. అనంతపురం జిల్లా యాడికిలో 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యాచరణ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు, జేసీ అస్మిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో అస్మిత్ రెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు. గతంలో సీఎంతో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ప్రజలతో పంచుకున్నారు.

జీవో లేదు.. కానీ నీళ్లొచ్చాయి 
గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో తాను ముఖ్యమంత్రిని కలిసి యాడికి కాలువకు, ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీటి కేటాయింపుల కోసం ఒక జీవో ఇవ్వాలని కోరినట్లు అస్మిత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. "ఆ సమయంలో సీఎం చంద్రబాబు గారు నన్ను దగ్గరకు తీసుకుని భుజంపై చేయి వేసి 'తమ్ముడూ.. జీవో గీవో ఏమీ లేదు. ప్రతి చెరువుకూ, ప్రతి కాలువకూ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా వెళ్లు' అని చెప్పారు. 

మొదటిసారి ఎమ్మెల్యే అయిన నాకు, చేతిలో కాగితం లేకపోతే అధికారులను ఎలా అడగాలా అని కొంత దిగులు కలిగింది. కానీ మీరు నమ్ముతారో నమ్మరో, నేను తాడిపత్రికి తిరిగి రాకముందే సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని, రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పారని అధికారుల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి" అని అస్మిత్ రెడ్డి వివరించారు. సీఎం మాట నిలబెట్టుకున్నారని, ఆయన చొరవతో సాధారణంగా డిసెంబర్‌కే ఎండిపోయే చెరువులు, ఈసారి ఏప్రిల్ నెలలో కూడా నీటితో కళకళలాడాయని తెలిపారు.

రైతుల గుండెల్లో బలరాముడు 
చంద్రబాబుపై ప్రశంసలు కొనసాగిస్తూ, "ఆనాడు భగీరథుడు గంగను భూమిపైకి తెచ్చాడో లేదో తెలియదు కానీ, మీరు మాత్రం ఈనాటి భగీరథుడై మా దాహార్తిని తీర్చారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడై కన్నీళ్లు తుడిచారు. చివరికి, రైతుల గుండెల్లో ఒక బలరాముడై నిలిచిపోయారు" అని అస్మిత్ రెడ్డి అన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు, జూనియర్ కాలేజీపై విజ్ఞప్తి 
నియోజకవర్గంలోని పలు సమస్యలను కూడా ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తమ పెద్దనాన్న జేసీ దివాకర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన నార్త్ కెనాల్, యాడికి కెనాల్, ఫ్లడ్ ఫ్లో కెనాల్, పెండేకల్లు, చాగల్లు రిజర్వాయర్ వంటి ప్రాజెక్టులు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం వస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆయన కోరారు.

అదేవిధంగా, యాడికి ప్రాంతంలో జూనియర్ కాలేజీ లేకపోవడంతో యువత చదువు మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "ఒకవైపు 30 కిలోమీటర్ల దూరంలో తాడిపత్రి, మరోవైపు 30 కిలోమీటర్ల దూరంలో గుత్తి, 60 కిలోమీటర్ల దూరంలో అనంతపురం ఉన్నాయి. దూరం కారణంగా చాలామంది చదువులకు దూరమవుతున్నారు. దయచేసి యాడికిలో ఒక జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసి యువతకు భరోసా ఇవ్వాలి" అని విజ్ఞప్తి చేశారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉన్నందున, యువతకు వ్యవసాయమే ప్రత్యామ్నాయమని, అందుకు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మా రైతులకు నీళ్లు అందించి, యువతకు భవిష్యత్తును ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
JC Asmith Reddy
Chandrababu Naidu
Tadipatri
Anantapur
Irrigation Project
AP Politics
Andhra Pradesh
Yadiki
Farmers Welfare
Water Security

More Telugu News