Khawaja Asif: కోల్‌కతాను టార్గెట్ చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై భారత ఏజెన్సీల అప్రమత్తం

Pak Minister Khawaja Asifs Kolkata Threat Triggers Alert in India
షార్ట్స్‌లో చూడండి
భారత్ ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్'కు పాల్పడితే, దానికి కోల్‌కతాలో బదులు తీర్చుకుంటామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలను భారత భద్రతా ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకరిపై నెపం మోపి దాడి చేసేందుకు పన్నే కుట్రను 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్'గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలో ఆసిఫ్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.

భారత్‌ను దురాక్రమణదారుగా చిత్రీకరించి, తమను తాము రక్షించుకునేందుకే పాక్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా 'ఆపరేషన్ సిందూర్' తరహాలోనే గట్టిగా బదులిస్తామని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే, దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని, ఉగ్ర స్థావరాలను మూసివేస్తేనే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెప్పింది.

పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను దృష్టిలో ఉంచుకునే ఆసిఫ్ కోల్‌కతాను ప్రస్తావించారని మరో అధికారి అభిప్రాయపడ్డారు. హర్కత్-ఉల్-జిహాద్ ఇస్లామీ (హుజీ), జమాత్-ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) వంటి ఉగ్రవాద సంస్థలను రెచ్చగొట్టి, ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే కుట్ర ఇందులో దాగి ఉందని అనుమానిస్తున్నారు. బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఈ సంస్థలు దాడులకు ప్రయత్నిస్తున్నట్లు తమ వద్ద ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని అధికారులు తెలిపారు.

భారత్-బంగ్లాదేశ్ మధ్య బలపడుతున్న సంబంధాలు కూడా పాకిస్థాన్‌కు అసహనం కలిగిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక, భద్రతా సహకారం మెరుగుపడటంతో, పశ్చిమ బెంగాల్ లేదా ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు జరిపించి ఆ సంబంధాలను దెబ్బతీయాలని పాక్ ఆశిస్తోంది. 'ఆపరేషన్ సిందూర్' వంటి చర్యలతో నిర్వీర్యమైన ఉగ్రవాద సంస్థల్లో నైతిక స్థైర్యం నింపేందుకే ఐఎస్ఐ ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహిస్తోందని అధికారులు పేర్కొన్నారు. భారత్‌పై దాడిని సాకుగా చూపి, కొత్త ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునే వ్యూహంలో భాగంగానే ఈ బెదిరింపులు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
Go Back to Shorts
Khawaja Asif
Pakistan
Kolkata
India
False Flag Operation
West Bengal Elections
Terrorist Groups
ISI
Operation Sindoor
India Bangladesh Relations

More Telugu News