Majid Khademi: ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ చీఫ్, మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ ఖదేమీ మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ ఘటనపై ఐఆర్‌జీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది నేరపూరిత ఉగ్రవాద దాడి అని, ఈ దాడిలో ఖదేమీ 'షహీద్' (అమరుడు) అయ్యారని పేర్కొంది. అయితే, దాడి ఎక్కడ జరిగిందనే ప్రదేశాన్ని మాత్రం ఐఆర్‌జీసీ వెల్లడించలేదు. ఇరాన్ భద్రతా వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన నిఘా విభాగానికి ఖదేమీ నాయకత్వం వహిస్తున్నారు.

ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి జరుగుతున్న దాడుల్లో ఇరాన్ అనేక మంది ఉన్నతాధికారులను కోల్పోయింది. గత నెలలోనే ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌లను ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. అంతకుముందు ఐఆర్‌జీసీ చీఫ్ మహమ్మద్ పక్‌పూర్, బసీజ్ ఫోర్స్ చీఫ్ ఘోలామ్‌రెజా సొలైమానీ వంటి కీలక నేతలు కూడా ఈ దాడుల్లో మరణించారు.

ఫిబ్రవరి 28న జరిగిన తొలి దాడిలోనే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను కూడా లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరించింది. 
Majid Khademi
Iran
IRGC
Israel
United States
air strike
Middle East tensions
Seyyed Majid Khademi
Quds Force
Islamic Revolutionary Guard Corps

More Telugu News