Iran: ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..!

Iran war impact fuel crisis hits neighboring countries
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వంటి పరిణామాలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చాయి. ఈ ఇంధన సంక్షోభం ప్రభావం భారత్ పొరుగు దేశాలపై తీవ్రంగా పడింది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా కాపాడుకునేందుకు ఆ దేశాలు ‘వార్-టైమ్’ తరహా అత్యవసర చర్యలు చేపడుతున్నాయి.

పాకిస్థాన్‌లో..
పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో పాక్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రకటించింది. ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో నెల రోజుల పాటు ప్రజలకు ఉచిత ప్రజారవాణా సౌకర్యం కల్పిస్తోంది. గతంలో పెరిగిన సోలార్ విద్యుత్ వినియోగం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఊతమిస్తోంది.

బంగ్లాదేశ్ లో..
గ్యాస్ అవసరాల కోసం పశ్చిమాసియాపై ఆధారపడే బంగ్లాదేశ్ సైతం పలు ఆంక్షలు విధించింది. షాపింగ్ మాల్స్‌ను సాయంత్రం 6 గంటలకు, కార్యాలయాలను 4 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో అలంకరణ కోసం లైట్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఎరువుల పరిశ్రమకు గ్యాస్ సరఫరా ఆపి, దాన్ని విద్యుత్ ఉత్పత్తికి మళ్లిస్తోంది.

శ్రీలంకలో..
2022 నాటి తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న శ్రీలంక ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇంధన సరఫరాపై కఠినమైన రేషనింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు వీధి దీపాలు, వాణిజ్య ప్రకటనల బోర్డులపై నిషేధం విధించింది. విద్యుత్ ఛార్జీలను ఏకంగా 40% పెంచింది.

నేపాల్ లో..
ఇంధనాన్ని పొదుపు చేసేందుకు నేపాల్ ప్రభుత్వం వారానికి రెండు రోజులు (శని, ఆదివారం) సెలవులు ప్రకటించింది. వంట గ్యాస్ కొరత రాకుండా సిలిండర్లను సగం నింపి పంపిణీ చేస్తోంది. మొత్తంమీద పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు దక్షిణాసియా దేశాల్లో సామాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సంక్షోభం ఒకరకంగా ఆ దేశాలను సౌర శక్తి, ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేసేలా ప్రోత్సహిస్తోంది.
Go Back to Shorts
Iran
Iran war
oil prices
fuel crisis
Pakistan
Bangladesh
Sri Lanka
Nepal
energy crisis
solar energy

More Telugu News