Qasim Soleimani: అమెరికాలో సోలిమానీ మేనకోడలు అరెస్ట్.. గ్రీన్ కార్డ్ రద్దు చేసిన ట్రంప్ సర్కార్

ఇరాన్‌పై అమెరికా తన కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. ఇరాన్ దివంగత సైనిక కమాండర్ ఖాసిం సోలిమానీ మేనకోడలు హమీదా సోలిమానీ అఫ్షర్, ఆమె కుమార్తెను అమెరికా ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదాను (గ్రీన్ కార్డ్) అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రద్దు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం వారిద్దరినీ దేశం నుంచి బహిష్కరించేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) కస్టడీకి తరలించారు. 

ఈ విషయాన్ని రూబియో స్వయంగా 'ఎక్స్‌' వేదికగా ప్రకటించారు. "ఇటీవలి వరకు హమీదా సోలిమానీ అఫ్షర్, ఆమె కుమార్తె గ్రీన్ కార్డులతో అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఆమె ఖాసిం సోలిమానీ మేనకోడలు మాత్రమే కాదు, ఇరాన్ ప్రభుత్వానికి గట్టి మద్దతుదారు. అమెరికన్లపై దాడులను సమర్థించడంతో పాటు మన దేశాన్ని 'గ్రేట్ సాతాన్' అని సంబోధించారు" అని రూబియో తన పోస్టులో పేర్కొన్నారు. 

అమెరికా వ్యతిరేక పాలనలకు మద్దతిచ్చే వారికి ట్రంప్ పరిపాలనలో చోటులేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు హమీదా భర్త కూడా అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

కొద్ది రోజుల క్రితం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో తన మొదటి హయాంలో ఖాసిం సోలిమానీని చంపాలన్న నిర్ణయం గురించి మాట్లాడారు. సోలిమానీ ఒక దుష్ట మేధావి అని, అతను బతికి ఉంటే ఇరాన్‌లోని పరిస్థితులు భిన్నంగా ఉండేవని వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగం జరిగిన కొద్ది రోజులకే ఆయన కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే నెలలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాజీ కార్యదర్శి అలీ లారిజానీ కుమార్తె, అల్లుడి లీగల్ స్టేటస్‌ను కూడా రూబియో రద్దు చేశారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ విదేశీ కార్యకలాపాల విభాగమైన ఖుద్స్ ఫోర్స్‌కు సోలిమానీ నాయకత్వం వహించారు. పశ్చిమాసియాలో అత్యంత శక్తిమంతమైన సైనిక వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. 2020 జనవరిలో బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సోలిమానీ మరణించిన విషయం తెలిసిందే.
Qasim Soleimani
Hamida Soleimani Afshar
Iran
US Relations
Green Card
Marco Rubio
Donald Trump
Immigration
Khuds Force
Ali Larijani

More Telugu News