Kollu Ravindra: మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్

కృష్ణా జిల్లా పెనమలూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించిన మంత్రి, విద్యార్థులతో ముచ్చటించి భోజన నాణ్యత, ఉపాధ్యాయుల బోధన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో దొడ్డు బియ్యంతో భోజనం పెట్టేవారని, ప్రస్తుతం సన్న బియ్యంతో రుచికరమైన ఆహారం అందిస్తున్నారని విద్యార్థులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి, వారితో కలిసి కూర్చుని భోజనం చేశారు.


ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతిరోజూ ఒక షెడ్యూల్ ప్రకారం ఆకుకూరలు, పప్పుతో కూడిన భోజనంతో పాటు ఒక గుడ్డును అందిస్తున్నట్లు వెల్లడించారు. 


గత ప్రభుత్వం రేషన్ బియ్యంతో విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుందని ఆయన విమర్శించారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 2,162 కోట్లు ఖర్చు చేస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 2,500 మోడల్ కిచెన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, మెగా డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేసి విద్యావ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి స్పష్టం చేశారు.

Kollu Ravindra
Andhra Pradesh
Midday Meal Scheme
Bode Prasad
Penamaluru
Government School
Nara Lokesh
Model Kitchens
Education System
Mega DSC

More Telugu News