Jeevitha Rajashekar: సినిమాలకు రివ్యూలు రాసేవారిపై జీవిత రాజశేఖర్ ఆగ్రహం

Jeevitha Rajashekar Criticizes Reviewers
షార్ట్స్‌లో చూడండి

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ యాక్షన్ డ్రామా ‘బైకర్’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి, నిర్మాత జీవిత రాజశేఖర్ రివ్యూయర్లపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి.


‘బైకర్’ సినిమా విజయోత్సవ సభలో జీవిత రాజశేఖర్ సినిమా రివ్యూల తీరుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సినిమా విశ్లేషణల విషయంలో రివ్యూయర్లు అనుసరిస్తున్న ధోరణిని జీవిత తప్పుబట్టారు. "సినిమాలో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటే మెలోడ్రామా అని తీసిపారేస్తారు. అదే స్టైలిష్‌గా తీస్తే డెప్త్ లేదని అంటారు. అసలు ఏది నమ్మాలో మాకు అర్థం కావడం లేదు. సినిమా ఎలా తీయాలో ఇక రివ్యూయర్లనే అడుగుదామా అనిపిస్తోంది" అంటూ మండిపడ్డారు.


ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టం, కోట్లాది రూపాయల పెట్టుబడి ఉంటుందని జీవిత గుర్తుచేశారు. రివ్యూలు చూసి నిర్ణయించుకోకుండా, ప్రేక్షకులు స్వయంగా థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. "నేను 'బతుకు జట్కాబండి' వంటి షోలు చేసినప్పుడు ఎన్నో వాస్తవ ఎమోషన్స్ చూశాను. ‘బైకర్’ సినిమాలో శర్వానంద్, రాజశేఖర్ గారు తమ కళ్లతోనే ఆ భావోద్వేగాలను అద్భుతంగా పలికించారు" అని కొనియాడారు.


షూటింగ్ ప్రారంభం నుంచి యూనిట్‌తో పాటే ప్రయాణించానని, దర్శకుడు అభిలాష్ రెడ్డి పడిన కష్టం తనకు తెలుసని, అందుకే థియేటర్‌లో కనురెప్ప వేయకుండా సినిమా చూశానని ప్రశంసించారు. చివరగా ఆమె ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. ఎవరితోనైనా మనస్పర్థలు ఉంటే మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఎవరినీ దూరం పెట్టకుండా అందరితో సంతోషంగా ఉండటమే అసలైన జీవితమని పేర్కొన్నారు.

Go Back to Shorts
Jeevitha Rajashekar
Biker Movie
Sharwanand
Rajashekar
Movie Reviews
Telugu Cinema
Abhilash Reddy
Tollywood
Batuku Jatka Bandi
Film Critics

More Telugu News