Iran Oil: ఏడేళ్ల తర్వాత ఇండియాకు ఇరాన్ చమురు.. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్!

దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఇరాన్ నుంచి ముడిచమురుతో భారత్‌కు వస్తున్న ఓ ట్యాంకర్, చివరి నిమిషంలో తన గమ్యాన్ని చైనాకు మార్చుకుంది. చెల్లింపులకు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న 'పింగ్ షున్' అనే నౌక.. ఇరాన్ ముడి చమురుతో గుజరాత్‌లోని వాడినార్ ఓడరేవుకు రావాల్సి ఉంది. అయితే, ప్రయాణ మధ్యంలో తన మార్గాన్ని మార్చుకుని, ప్రస్తుతం చైనాలోని డాంగింగ్ రేవుకు వెళుతున్నట్లు షిప్-ట్రాకింగ్ సంస్థ కెప్లర్ వెల్లడించింది. ఈ నెల‌ 4 నాటికి ఈ నౌక వాడినార్‌కు చేరుకోవాల్సి ఉండగా ఈ మార్పు జరిగింది.

చెల్లింపుల విషయంలో నిబంధనలు కఠినతరం కావడమే ఇందుకు ప్రధాన కారణమని కెప్లర్ విశ్లేషకుడు సుమిత్ రిటోలియా అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరిగా 30-60 రోజుల క్రెడిట్ కాకుండా, ఇప్పుడు వెంటనే డబ్బు చెల్లించాలని అమ్మకందారులు కోరుతున్నట్లు సమాచారం. ఈ నౌకలో సుమారు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉన్నట్లు అంచనా.

ఇరాన్‌పై అమెరికా ఇటీవల ఆంక్షలను తాత్కాలికంగా సడలించడంతో భారత రిఫైనరీలు అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపాయి. ఈ నేపథ్యంలోనే 'పింగ్ షున్' నౌక భారత్‌కు బయలుదేరింది. ఒకప్పుడు భారత్, ఇరాన్ నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకునేది. అయితే, 2019 మే నుంచి అమెరికా ఆంక్షల కారణంగా దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ మొదలవుతాయనుకున్న ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.
Iran Oil
India Iran
Crude Oil
Oil Tanker
Ping Shun
Vadinar Port
China
Oil Imports
US Sanctions
Sumit Ritolia

More Telugu News