Yadagiri Chinna Goud: హైదరాబాద్‌లో మరో 'గోల్డ్ మ్యాన్'... రూ.కోటి విలువైన బంగారం సీజ్

ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ హైదరాబాద్‌లో మరో ‘గోల్డ్ మ్యాన్’ కేసును వెలుగులోకి తెచ్చింది. యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ.1 కోటి విలువైన, లెక్కల్లో చూపని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లోని సెక్షన్ 247 కింద దేశవ్యాప్తంగా నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. గతంలో ఇలాంటి చర్యలను పాత చట్టంలోని సెక్షన్ 132 కింద తీసుకునేవారు.

ఐటీ శాఖ హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు చిన్న పహిల్వాన్‌పై దాడులు నిర్వహించారు. అతని వద్ద మొత్తం 900 గ్రాముల బంగారం ఉండగా, అందులో 700 గ్రాములకు సరైన లెక్కలు చూపలేదని గుర్తించారు. దీంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, వ్యక్తిగత వినియోగం కోసం సుమారు 150 నుంచి 200 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇచ్చినట్లు తెలిపారు.

టీవీ ఛానళ్లు, యూట్యూబ్‌లో చిన్న పహిల్వాన్ ఇచ్చిన ఇంటర్వ్యూల ఆధారంగా సోషల్ ప్రొఫైలింగ్ చేసి ఈ దర్యాప్తు ప్రారంభించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. అతను భారీగా బంగారు ఆభరణాలు ధరించి కనిపించడంతో అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో ఐటీ శాఖ దృష్టికి వచ్చిన మూడో 'గోల్డ్ మ్యాన్' చిన్న పహిల్వాన్. ఇంతకుముందు కొండా విజయకుమార్, సూర్య భాయ్ అనే వ్యక్తులపైనా ఇలాంటి చర్యలు తీసుకున్నారు.
విచారణలో తన వద్ద ఉన్న బంగారం లెక్కల్లో లేనిదని చిన్న పహిల్వాన్ అంగీకరించినట్లు సమాచారం. అద్దెలు, భూముల వ్యాపారం ద్వారా ఈ బంగారం సంపాదించినట్లు చెప్పినా, ఆదాయానికి సరైన ఆధారాలు చూపించలేకపోయారు. అతను దాఖలు చేసిన ఒకే ఐటీ రిటర్న్‌లో కేవలం రూ.4 లక్షల ఆదాయం మాత్రమే చూపినట్లు అధికారులు గుర్తించారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ)పై భూములు కొని, వాటిని ఎక్కువ ధరకు అమ్మి, మధ్యలో తేడా మొత్తాన్ని నగదుగా తీసుకునేవారని దర్యాప్తులో తేలింది.

చిన్న పహిల్వాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలపైనా అధికారులు దృష్టి సారించారు. గచ్చిబౌలి ప్రాంతంలో వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా, రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లలో చురుగ్గా ఉండే వ్యక్తిగా చిన్న పహిల్వాన్‌కు పేరుంది. ఈ కేసుపై ఐటీ శాఖ దర్యాప్తు కొనసాగిస్తోంది.
Yadagiri Chinna Goud
Chinna Pahalwan
Hyderabad Gold Man
Income Tax Hyderabad
IT Raids
Gold Seizure
Black Money
Real Estate Hyderabad
Konda Vijayakumar
Surya Bhai

More Telugu News