Raghav Chadha: రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు!

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ యువనేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను సభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించాలని ఆప్ నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్‌కు పార్టీ లేఖ రాసింది. ఆయన స్థానంలో మరో ఎంపీ అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదించింది. అంతేకాకుండా, సభలో చద్దాకు మాట్లాడే సమయాన్ని కేటాయించవద్దని కూడా ఆ లేఖలో కోరడం పార్టీలో అంతర్గత పరిణామాల తీవ్రతను సూచిస్తోంది.

గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు, ముఖ్యమైన కార్యక్రమాలకు రాఘవ్ చద్దా దూరంగా ఉంటున్నారు. మార్చిలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో వైద్య కారణాలతో విదేశాల్లో ఉన్న చద్దా, ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. ఇటీవల కేజ్రీవాల్, సిసోడియాలకు ఎక్సైజ్ కేసులో ఊరట లభించినప్పుడు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు, జంతర్ మంతర్ ర్యాలీకి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆయనను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంపై రాఘవ్ చద్దా నేరుగా స్పందించలేదు. అయితే, ఈ వార్తలు వెలువడిన కొద్దిసేపటికే తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. పార్లమెంటులో తాను గతంలో విమానాల జాప్యం, ఆహార కల్తీ, పేపర్ లీకేజీలు వంటి ప్రజా సమస్యలపై మాట్లాడిన ప్రసంగాల క్లిప్పింగులను అందులో పొందుపరిచారు. ఒకప్పుడు కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో వేగంగా ఎదిగిన నేతగా పేరుగాంచిన చద్దాను ఉన్నట్టుండి పక్కనపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.  
Raghav Chadha
Aam Aadmi Party
AAP
Rajya Sabha
Ashok Mittal
Arvind Kejriwal
Deputy Leader
Indian Politics

More Telugu News