Telangana Pensions: తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Telangana Government Approves 2 Lakh New Pensions Under Cheyutha Scheme
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేయూత పథకం కింద కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.233 కోట్లను కేటాయించడంతో, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. అయితే, ఇప్పటికే పేరుకుపోయిన లక్షలాది దరఖాస్తుల నుంచి అర్హులను గుర్తించడం అధికారులకు పెను సవాల్‌గా మారనుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 42.23 లక్షల మంది నెలనెలా చేయూత పెన్షన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. దివ్యాంగులకు మాత్రం పెన్షన్‌ను రూ.4,016గా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో 2 లక్షల మంది కొత్తగా చేరనున్నారు. గత మూడేళ్లుగా బోదకాలు, డయాలసిస్ బాధితులకు తప్ప కొత్తగా ఎలాంటి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైన వారు తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరి పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల బడ్జెట్‌లో కొత్త పెన్షన్ల ప్రకటన వెలువడిన తర్వాత, ఫిబ్రవరి 20 నుంచి ప్రజావాణి వంటి కార్యక్రమాల ద్వారా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు, గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో కూడా భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం ఆమోదించినవి 2 లక్షల పెన్షన్లు కాగా, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. వీటిలో వృద్ధాప్య పింఛన్ కోసం 4 లక్షలు, వితంతు, ఒంటరి మహిళల కోటాలో 3.5 లక్షలు, గీత, చేనేత కార్మికుల విభాగంలో 3 లక్షలు, దివ్యాంగుల పింఛన్‌కు 72 వేల దరఖాస్తులు ఉన్నాయి. ఈ భారీ సంఖ్య నుంచి కేవలం 2 లక్షల మంది అత్యంత అర్హులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరలోనే పటిష్టమైన వడపోత కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది.
Go Back to Shorts
Telangana Pensions
Revanth Reddy
Cheyutha scheme
Telangana government
Pension scheme
Old age pensions
Widow pensions
Disabled pensions
Telangana budget
Pension applications

More Telugu News