Mojtaba Khamenei: దేశాన్ని మళ్లీ నిర్మిద్దాం.. విధ్వంసం తర్వాత పునర్నిర్మాణానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపు

అమెరికా- జాయినిస్ట్ (అమెరికా, ఇజ్రాయిల్) శక్తులు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడులు చేసి విధ్వంసం సృష్టించాయని, ఈ దాడిలో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించి దేశాన్ని పునర్నిర్మించేందుకు దేశవ్యాప్తంగా కృషి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే, జాతీయ ప్రకృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆయన ఈ సందేశం ఇచ్చినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ప్రెస్ టీవీ ఒక కథనంలో వెల్లడించింది. ఇటీవలి ఘర్షణల తర్వాత దేశ భవిష్యత్ శ్రేయస్సు కోసం జాతీయ ప్రయత్నాలు సాగాలని ఆయన స్పష్టం చేశారు.

దివంగత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తబా ఖమేనీ, శత్రువుల దాడులు కేవలం ప్రజలనే కాకుండా దేశ భూభాగాన్ని, సహజ పర్యావరణాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. "క్రూరమైన అమెరికా, జాయినిస్ట్ శత్రువులు తమ అనాగరిక చర్యలలో ఎలాంటి మానవ, నైతిక పరిమితులు పాటించడం లేదు. ఇలాంటి సమయంలో దేశం అంతర్గత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి" అని ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రెస్ టీవీ పేర్కొంది. ఇరాన్ ఉజ్వల భవిష్యత్తు కోసం చేపట్టే ప్రతి ప్రయత్నం ఎంతో విలువైందని, అవసరమని ఆయన నొక్కిచెప్పారు.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన తన సందేశంలో నివాళులర్పించారు. ముఖ్యంగా దేశంలోని దక్షిణ నగరమైన మినాబ్‌లోని ఒక బాలికల పాఠశాలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో 186 మంది విద్యార్థినులు మరణించినట్లు ప్రెస్ టీవీ నివేదించింది. "పిల్లలను చంపే రాక్షస అమెరికా, జాయినిస్ట్ దుర్మార్గులు పాఠశాలలోని పసిమొగ్గలను కిరాతకంగా బలిగొన్నారు" అని ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా, దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ప్రజలను కోరారు. కొనసాగుతున్న యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఇరాన్ ప్రజలు తమ భూమి అంతటా 'ఆశ అనే మొక్కను' నాటుతున్నారని ఆయన అన్నారు. ఈ మొక్కలు రాబోయే సంవత్సరాల్లో ఫలవంతమైన, ఆశీర్వాద వృక్షాలుగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, నౌరోజ్ (వసంతకాల వేడుకలు) సందర్భంగా ఇరాన్ ప్రజలు దృఢమైన సంకల్పంతో, గౌరవంతో నిలబడ్డారని ఆయన ప్రశంసించారు.
Mojtaba Khamenei
Iran
Supreme Leader
Reconstruction
Islamic Republic Day
Zionist
United States
Mina school attack
National Nature Day
Ayatollah Ali Khamenei

More Telugu News