Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో ప్రియాంక చోప్రా.. గిన్నెలు కడుగుతూ సేవ!

Priyanka Chopra Visits Golden Temple Doing Seva
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోయిన‌ ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత భారత్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె పర్యటనకు సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణ దేవాలయాన్ని (గోల్డెన్ టెంపుల్) సందర్శించుకున్న ప్రియాంక, అక్కడ ఆధ్యాత్మిక సేవలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. గుడి ప్రాంగణంలో ఆమె స్వయంగా గిన్నెలు శుభ్రం చేస్తూ కనిపించారు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతోంది.

నిన్న‌ మహావీర్ జయంతి సందర్భంగా ప్రియాంక స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. గులాబీ రంగు దుస్తులు ధరించి, తలపై దుపట్టా కప్పుకుని ఆమె ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సిక్కు మతంలో ఎంతో పవిత్రంగా భావించే ‘సేవ’లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఉపయోగించే పాత్రలను ఆమె శ్రద్ధగా శుభ్రం చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఒక సామాన్య భక్తురాలిగా ఆమె సేవలో నిమగ్నమవడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

అయితే, ప్రియాంక భారత్ పర్యటన వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆమె తన సినిమా షూటింగ్ కోసమే ఇక్కడికి వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ అనే చిత్రంలో ప్రియాంక నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసమే ఆమె పంజాబ్ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ భారీ యాక్షన్ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. చాలా విరామం తర్వాత ప్రియాంక చోప్రా ‘వారణాసి’ చిత్రంతో భారతీయ సినీ పరిశ్రమలోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ‘మందాకిని’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Go Back to Shorts
Priyanka Chopra
Golden Temple
Amritsar
SS Rajamouli
Varanasi Movie
Mahesh Babu
Prithviraj Sukumaran
Indian Cinema
Mahaveer Jayanti

More Telugu News