AP Police: ఏపీ పోలీసుల చేతికి కొత్త అస్త్రం.. సెకన్లలోనే నేరచరిత బట్టబయలు!

AP Police Get New Weapon Papillon Fingerprint Scanner
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో నేరాలను నియంత్రించి, పాత నేరస్థులకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఇందులో భాగంగా తాజాగా ‘పాపిల్లాన్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌’ అనే అత్యాధునిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పరికరం సాయంతో అనుమానితుల నేర చరిత్రను కేవలం సెకన్ల వ్యవధిలోనే తెలుసుకోవచ్చు. నేర నియంత్రణలో ఇది ఒక కీలక అస్త్రంగా మారనుందని పోలీస్ శాఖ భావిస్తోంది.

ఈ స్కానర్‌ చాలా చిన్నదిగా, తేలికగా ఉండటంతో పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు సులభంగా తమతో పాటు తీసుకెళ్లవచ్చు. దీనిని మొబైల్‌లోని ప్రత్యేక యాప్‌తో అనుసంధానిస్తారు. అనుమానిత వ్యక్తి బొటన వేలు లేదా చూపుడు వేలి ముద్రను స్కానర్‌పై ఉంచిన వెంటనే, ఆ వివరాలు పోలీస్ శాఖ వద్ద ఉన్న డేటాబేస్‌తో సరిపోల్చుకుంటాయి. ఒకవేళ ఆ వ్యక్తిపై రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా కేసులు నమోదై ఉన్నా, రౌడీ షీట్ తెరిచి ఉన్నా.. ఆ వివరాలన్నీ క్షణాల్లో స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఏ కేసు, ఎక్కడ నమోదైంది వంటి పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ ఎలాంటి నేర చరిత్ర లేకపోతే 'నాట్ ఫౌండ్' అని చూపిస్తుంది.

ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పాత నేరస్థులు, దొంగలు ప్రయాణికులతో కలిసిపోయి నేరాలకు పాల్పడుతుంటారు. వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా ఉండేది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేరస్థులను పట్టుకోవడం కష్టమయ్యేది. ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీ కాస్తున్న సిబ్బందికి అనుమానితులను విచారించినా, వారిపై కేసులు ఉన్నాయో? లేదో? తెలుసుకోవడానికి సమయం పట్టేది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు.

ఈ పాపిల్లాన్‌ స్కానర్‌ రాకతో పోలీసుల పనితీరు మరింత సులభతరం కానుంది. నేరస్థుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, అనుమానితుల వివరాలను వెంటనే ధృవీకరించుకోవడం ద్వారా నేరాలు జరగకముందే నివారించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా నేరాల నియంత్రణలో ఈ పరికరం ఒక కీలక సాధనంగా ఉపయోగపడనుంది.


Go Back to Shorts
AP Police
Andhra Pradesh Police
Papillon Fingerprint Scanner
crime control
fingerprint scanner
crime detection
technology in policing
AP crime
police technology
criminal identification

More Telugu News