Balochistan: పాకిస్థాన్ లో గ్యాస్ పైప్ లైన్ పేల్చివేసిన దుండగులు.. వీడియో ఇదిగో!

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో మరోసారి భారీ విధ్వంసం చోటుచేసుకుంది. క్వెట్టా నగరం వెలుపల ఉన్న అక్తరాబాద్ ప్రాంతంలో ప్రధాన గ్యాస్ పైప్‌లైన్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పేలుడుకు పాల్పడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో పైప్‌లైన్ పూర్తిగా ధ్వంసమై భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ పరిణామంతో రాజధాని క్వెట్టాతో పాటు పలు జిల్లాల్లో గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

సూయి సదరన్ గ్యాస్ కంపెనీ (ఎస్ఎస్ జీసీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో 18 అంగుళాల వ్యాసం కలిగిన ప్రధాన పైప్‌లైన్ ధ్వంసమైంది. ఫలితంగా క్వెట్టా, మాస్తుంగ్, కలాత్, పిషిన్, జియారత్ వంటి ఐదుకు పైగా జిల్లాల్లో గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసక చర్య అని ప్రాథమికంగా నిర్ధారించింది. పైప్‌లైన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత, మంగళవారం ఉదయం నుంచి మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. సరఫరా పునరుద్ధరించడానికి దాదాపు 12 నుంచి 24 గంటల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, గతంలోనూ ప్రభుత్వ ఆస్తులు, ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకున్న బలూచ్ వేర్పాటువాద గ్రూపుల పనే అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి బలూచిస్థాన్‌లో ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Balochistan
Pakistan
Gas pipeline
Quetta
Baloch separatists
Gas supply disruption
Terrorist attack
Sui Southern Gas Company
Explosion
Balochistan blast

More Telugu News