Kerosene: రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీ.. 60 రోజుల పాటు సరఫరాకు కేంద్రం ఆదేశం

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (ఎల్పీజీ)  కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనలు, ఇంధన కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 60 రోజుల పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా 'సుపీరియర్ కిరోసిన్' సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా హార్ముజ్ జలసంధి మూసివేయడంతో ఇంధన సరఫరాపై ప్రభావం పడవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కిరోసిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించినట్లు తెలిపింది.

ఈ కిరోసిన్‌ను రేషన్ షాపులతో పాటు, లైసెన్స్ ఉన్న పెట్రోల్ పంపుల ద్వారా కూడా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పెట్రోలియం చట్టం-1934, పెట్రోలియం నిబంధనలు-2002 కింద నిల్వ నిబంధనలను తాత్కాలికంగా సడలించారు. వంట, దీపాల కోసం ఈ కిరోసిన్‌ను ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, 60 రోజుల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొనసాగుతాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నల్లబజారును అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.
 
Kerosene
Kerosene supply
Central Government
LPG shortage
Public Distribution System
PDS
Petroleum Ministry
India
Fuel crisis
Gas shortage

More Telugu News