Karthik Sharma: రూ.14 కోట్ల ఆటగాడు... తొలి మ్యాచ్ లో ఫ్లాప్!

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు రూ.14.2 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యువ సంచలనం కార్తిక్ శర్మ, ఐపీఎల్ 2026 అరంగేట్రంలోనే తీవ్రంగా నిరాశపరిచాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి, 15 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతని వైఫల్యంతో సీఎస్‌కే కష్టాల్లో పడింది.

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే ఆదిలోనే తడబడింది. టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన దశలో ఆరో నంబర్‌లో వచ్చిన కార్తిక్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, అతను కూడా మరో డెబ్యూటెంట్ బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ సమయంలో సీఎస్‌కే 11 ఓవర్లలో 74/7 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో ఉంది.

ఎవరీ కార్తిక్ శర్మ? 
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల కార్తిక్ శర్మ ఒక వికెట్ కీపర్ బ్యాటర్. చిన్నప్పటి నుంచే సిక్సర్లు కొట్టే క్రికెటర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన అద్భుతం. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 2025-26 రంజీ సీజన్‌లోనూ సిక్సర్ల మోత మోగించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో అదరగొట్టాడు. ఈ సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం కారణంగానే ఐపీఎల్ 2026 వేలంలో అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో అత్యధికంగా రూ.14.2 కోట్లకు సీఎస్‌కే అతడిని దక్కించుకుంది.

తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, అతని దేశవాళీ రికార్డులు అతని ప్రతిభకు నిదర్శనం. భవిష్యత్తులో సీఎస్‌కే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Karthik Sharma
CSK
Chennai Super Kings
IPL 2026
Rajasthan Royals
Vijay Hazare Trophy
Syed Mushtaq Ali Trophy
Cricket
Indian Premier League
Riyan Parag

More Telugu News