Raghurama Krishnam Raju: ఆకివీడు రామాలయ పునర్నిర్మాణంపై రఘురామ కీలక ప్రకటన

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయాన్ని పునర్నిర్మించనున్నట్లు తెలిపారు. ఇటీవల శ్రీరామనవమి రోజున తనపై దాడికి యత్నం జరిగిన ప్రదేశంలోనే ఈ ఆలయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నట్లు వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ మేరకు ఆయన ఆదివారం నాడు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, సుప్రసిద్ధ స్థపతి (శిల్పకళా నిపుణుడు) డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో ఈ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. శిల్పకళ, వాస్తు, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పూర్తిగా కృష్ణ శిలతో ఆలయాన్ని నిర్మిస్తామని, కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కుచెదరని విధంగా ఈ నిర్మాణం ఉంటుందని రఘురామ వివరించారు.

త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇదే ఆలయం వద్ద రఘురామకృష్ణరాజుపై కొందరు దాడికి యత్నించిన ఘటన కలకలం రేపడం తెలిసిందే.
Raghurama Krishnam Raju
Akiveedu
Ramalayam
Temple Renovation
West Godavari
Andhra Pradesh
Emani Siva Nagi Reddy
Hindu Organizations
Temple Construction
Sriramanavami

More Telugu News