Sajjanar VC: రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా మా ప్రత్యేక నిఘా ఉంది: సజ్జనార్

నేడు ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను కేవలం ఆటలాగే ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్‌పై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని, ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

గతంలో వందలాది బెట్టింగ్ యాప్‌లను నిషేధించినప్పటికీ, నిర్వాహకులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలుగా ఈ దందా కొనసాగుతోందని ఆయన వివరించారు. కేవలం డబ్బు కోసం ఇలాంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆన్‌లైన్‌లోనే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రదేశాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించామని కమిషనర్ పేర్కొన్నారు. బెట్టింగ్ కారణంగా అప్పులపాలై కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. తమ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే, వెంటనే డయల్ 100కు గానీ, 94906 16555 వాట్సాప్ నంబర్‌కు గానీ సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
Sajjanar VC
Hyderabad Police
IPL Betting
Online Betting
Cricket Betting
Betting Apps
Social Media Influencers
Offline Betting
Cyber Crime
Telangana Police

More Telugu News