AP Coaching Centers: ఏపీలో కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ కళ్లెం.. కఠిన నిబంధనల జారీ

ఏపీలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కోచింగ్ సెంటర్ నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ 'ఏపీ కోచింగ్ సెంటర్ల నియంత్రణ, పర్యవేక్షణ నిబంధనలు-2026' పేరుతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే నడుస్తున్న కేంద్రాలు కూడా మూడు నెలల్లోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీయే కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్లు మంజూరు చేయడం, విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడం వంటి బాధ్యతలు చూస్తుంది. అంతేగాక‌ మీడియా కథనాలు లేదా పోలీసు రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తనిఖీలు చేసే అధికారాన్ని కూడా ఈ కమిటీకి కల్పించారు.

కొత్త నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు రోజుకు గరిష్ఠంగా ఐదు గంటలు మాత్రమే పనిచేయాలి. పాఠశాలలు, కళాశాలలు నడిచే సమయంలో కోచింగ్ తరగతులు నిర్వహించకూడదు. ఆదివారం తప్పనిసరిగా సెలవు ప్రకటించాలి. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రతి కేంద్రంలో ఒక వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, కౌన్సిలింగ్ అందించాలి. ఆత్మహత్యలను నివారించేందుకు స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఫీజు తిరిగివ్వాలి.. సర్టిఫికెట్లు తీసుకోవద్దు
ఫీజుల విషయంలో విద్యార్థులను వేధించకూడదని, ఒకవేళ విద్యార్థి మధ్యలో కోర్సు మానేస్తే మిగిలిన కాలానికి ఫీజును దామాషా ప్రకారం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల ఒరిజినల్ అకడమిక్ సర్టిఫికెట్లను తీసుకోరాదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఈ కోచింగ్ సెంటర్లలో పనిచేయడంపై నిషేధం విధించారు. ప్రతి కోచింగ్ సెంటర్ తప్పనిసరిగా ఒక వెబ్‌సైట్‌ను నిర్వహించాలని, అందులో ఫీజులు, సిబ్బంది, మౌలిక వసతుల వివరాలను పొందుపరచాలని ఆదేశించారు.

నిబంధనలు మీరితే రిజిస్ట్రేషన్ రద్దు.. కోచింగ్ సెంటర్లకు భారీ జరిమానాలు
నిబంధనలు ఉల్లంఘించిన కేంద్రాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. లోపాలను సరిదిద్దుకోవడానికి 15 రోజుల గడువు ఇస్తారు. ఆ తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే మొదటిసారి రూ. 50 వేలు, రెండోసారి రూ. లక్ష జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా ఉల్లంఘన పునరావృతమైతే ఆ సెంటర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు.
AP Coaching Centers
Andhra Pradesh
coaching centers regulation
student suicides
education policy
private coaching centers
wellness centers
student mental health
fee reimbursement
collector committee

More Telugu News