PSL: ఐపీఎల్ దెబ్బకు విలవిల.. పీఎస్ఎల్‌ను వరుసగా వీడుతున్న ఆటగాళ్లు!

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తాజా సీజన్ ప్రారంభమైనప్పటికీ, దానికంటే ఎక్కువగా ఐపీఎల్ గురించే చర్చ జరుగుతోంది. పీఎస్ఎల్‌ను కాదని పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ పరిణామంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందాలను ఉల్లంఘించి ఐపీఎల్‌కు వెళ్లిన ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక, పీఎస్ఎల్‌లో లాహోర్ ఖలందర్స్‌ను వీడి, ఐపీఎల్‌లో గాయపడిన శామ్ కరన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్‌లో చేరనున్నాడు. అదేవిధంగా జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ, ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడాల్సి ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా క్వెట్టా గ్లాడియేటర్స్‌ను కాదని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు.

కేవలం ఆటగాళ్లే కాదు, కామెంటేటర్లు సైతం పీఎస్ఎల్ కంటే ఐపీఎల్‌కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ పేరును మొదట పీఎస్ఎల్ కామెంటరీ ప్యానెల్‌లో ప్రకటించినా, తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ జాబితాలోనూ ఆయన పేరు కనిపించింది.

ఇదిలావుండగా, పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం కారణంగా పొదుపు చర్యలు చేపట్టడంతో పీఎస్ఎల్ ఆరంభం చాలా నిశ్శబ్దంగా జరిగింది. ప్రేక్షకులు లేకుండానే లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించారు. ప్రారంభోత్సవ వేడుకను కూడా రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై 69 పరుగుల తేడాతో గెలిచింది.
PSL
Pakistan Super League
IPL
Indian Premier League
Mohsin Naqvi
Dasun Shanaka
Blessing Muzarabani
Spencer Johnson
Lahore Qalandars
Cricket

More Telugu News