భారత్‌, చైనా అభివృద్ధి ఎవరి భిక్ష కాదు: అమెరికాకు చైనా రాయబారి చురక

భారత్, చైనా దేశాల అద్భుతమైన ఆర్థిక వృద్ధిపై అమెరికా చేస్తున్న వ్యాఖ్యలను చైనా రాయబారి షు ఫీహాంగ్ తీవ్రంగా ఖండించారు. ఈ రెండు దేశాలు సాధించిన విజయాలు ప్రజల కఠోర శ్రమ, జ్ఞానం వల్ల వచ్చినవే తప్ప, ఇతర దేశాల దయ లేదా ఉదారత వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు.


ఇటీవలే అమెరికా ఉప విదేశాంగ మంత్రి క్రిస్టోఫర్ లాండౌ మాట్లాడుతూ, "చైనా విషయంలో మేము చేసిన తప్పు అతిగా సహకరించడం. భారత్ విషయంలో ఆ తప్పు చేయము" అని వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా... మా అభివృద్ధి ఎవరి ప్రోత్సాహంతోనో రాలేదని షు ఫీహాంగ్ చురకలు వేశారు. భారత్- చైనా యువజన చర్చల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


భారత్-చైనా మధ్య విభేదాలను పెంచి, ఆ గొడవల ద్వారా లాభం పొందాలని కొన్ని శక్తులు (అమెరికాను ఉద్దేశిస్తూ) చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. 'చైనా ముప్పు' అనే ప్రచారాన్ని నమ్మవద్దని యువతకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఎకానమీ, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఇరుదేశాల యువత కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. చైనా '15వ పంచవర్ష ప్రణాళిక', భారత్ 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాలు ఒకే దిశలో ఉన్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కుల కోసం భారత్-చైనా కలిసి పోరాడాలని అన్నారు. ఇరు దేశాలు పరస్పర విజయం కోసం కలిసి పని చేయాలని ఆకాంక్షించారు.


More Telugu News