ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన కొరత నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంపై 'కాంతార' నటుడు కిషోర్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో దేశాన్ని కులమతాల వారీగా విడగొట్టి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కలిసి ఉండాలని అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.


దేశాన్ని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులుగా విడగొట్టి ప్రజల మధ్య ద్వేషాన్ని నింపిన తర్వాత, ఇప్పుడు విపత్తులు వస్తున్నాయని అందరినీ ఏకం కావాలని కోరడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. నోట్ల రద్దు, రఫేల్ ఒప్పందం, కరోనా లాక్‌డౌన్, అగ్నివీర్, వ్యవసాయ చట్టాల వంటి కీలక నిర్ణయాల సమయంలో ప్రజలను, ప్రతిపక్షాలను కనీసం సంప్రదించారా? అని నిలదీశారు.

కరోనా సమయంలో సుమారు 50 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం వారిని లెక్కలోకి తీసుకోలేదని కిషోర్ మండిపడ్డారు. ప్రజలు గొర్రెల మందలా చావడానికి సిద్ధంగా లేరని హెచ్చరించారు. మణిపూర్, కశ్మీర్, లడఖ్ సమస్యలపై ప్రధాని మౌనాన్ని ఆయన తప్పుబట్టారు.

యుద్ధ నేరాలకు పాల్పడుతున్న దేశాధినేతలను (ఇజ్రాయెల్) కౌగిలించుకునే ముందు ప్రజల అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తూ, ప్రధాని తీరును 'నాన్-బయోలాజికల్ మ్యాడ్నెస్' (అశాస్త్రీయమైన వెర్రితనం)గా అభివర్ణించారు. దేశ అత్యున్నత పదవికి గౌరవం ఇవ్వలేని వారు ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.


More Telugu News