బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శాసనసభలో గందరగోళం.. తప్పుచేస్తేనే క్షమాపణ చెబుతానన్న రాకేశ్ రెడ్డి

ఇప్పపువ్వు సారాకు ఇందిరమ్మ పేరు పెట్టవద్దంటూ బీజేపీ శాసనసభ్యుడు పైడి రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. బడ్జెట్ పద్దుల చర్చ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పపువ్వు సారా అంశంపై శాసనసభలో చర్చ జరిగింది. సారా పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టవద్దని సూచించారు. ఇప్ప సారాకు ఇప్ప టకీలా లేదా మరేదైనా పేరు పెట్టాలని అన్నారు.

ఇందిరాగాంధీ పేరును ప్రస్తావించడంపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ పేరును తీసుకురావడం సరికాదని, రాకేశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా, తప్పుదొర్లిందని ఒప్పుకోవాలని మంత్రులు అన్నారు. ఇందిరమ్మపై బీజేపీకి అంత కోపమెందుకని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు.

తప్పు చేస్తే క్షమాపణ చెబుతా.. కానీ: రాకేశ్ రెడ్డి

తాను తప్పు చేస్తే క్షమాపణ చెబుతానని, కానీ తన మాటల్లో ఎలాంటి తప్పులేదని రాకేశ్ రెడ్డి అన్నారు. వాళ్లు మాట్లాడిందే ఈ సభలో నడుస్తుందంటే ఎలా అని ప్రశ్నించారు. అసలు గతంలో కొందరు ఇందిరమ్మపై తప్పుగా మాట్లాడితే మొదట ఖండించింది తానే అన్నారు. ఇక్కడి వారు ఎవరూ ఖండించలేదని తెలిపారు. తాను తప్పు మాట్లాడితేనే క్షమాపణ చెబుతానని అన్నారు. ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు.

తమను చూస్తు 'తమాషాగా' ఉందా అని అంటున్నారని, ఎందుకు బెదిరిస్తున్నారు, ఏం చేస్తారని రాకేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై సభా కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఇదే సభలో ఇష్టారీతిన మాట్లాడిన వారు ఉన్నారని, వారు ఏం చేసినా చెల్లుతుందా అని ప్రశ్నించారు. కొత్తవాళ్లు రాజకీయాల్లోకి వచ్చి, ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీకి బాధగా ఉన్నట్లు ఉందని అన్నారు.

అన్ని పథకాలకు ఇందిరమ్మ పేర్లు పెడుతున్నారని, కాబట్టి ఈ పథకానికి కూడా ఆ పేరు వద్దని మాత్రమే తాను సూచించానని అన్నారు. కానీ ఉక్కుమహిళ ఇందిరమ్మను తాను అగౌరవపరచలేదని అన్నారు. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్లిన వారు ఉన్నారని విమర్శించారు.

కేసీఆర్‌ను అన్నప్పుడు ఈ నిబంధన ఎక్కడకు పోయింది: హరీశ్ రావు

ఒక్క విషయాన్ని పట్టుకుని లాగవద్దని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రైతులు సహా రాష్ట్రంలోని వివిధ సమస్యలపై మాట్లాడకుండా ఒక్క విషయాన్ని తీసుకుని సాగదీయడం సరికాదని అన్నారు. రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పని చెబుతున్నారని, మరి గతంలో తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను విమర్శించినప్పుడు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది కదా అని అన్నారు.


More Telugu News