తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు.


అసోసియేషన్ వెల్లడించిన వాస్తవాలు:

  • సరిపడా నిల్వలు: ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) వద్ద రాష్ట్ర అవసరాలకు మించి ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

  • రద్దీ వల్లే సమస్య: ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుకోవడం, అందరూ 'ఫుల్ ట్యాంక్' చేయించుకోవడానికి మొగ్గు చూపడం వల్లే బంకుల్లో ఉన్న నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి.

  • తాత్కాలిక అంతరాయం: బంకుల్లో స్టాక్ అయిపోయిన తర్వాత, డిపోల నుంచి మళ్ళీ ట్యాంకర్లు వచ్చి నింపడానికి కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజలు దానిని శాశ్వత కొరతగా భావిస్తున్నారు.


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, కంటైనర్లు, కార్లు గంటల తరబడి క్యూలో ఉంటున్నాయి. "కొరత లేదు అని మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు, ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలనే ఆత్రుత వల్లే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడుతోంది" అని బంకుల యజమానులు వాపోతున్నారు.


More Telugu News