పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు.. పరుగులు పెట్టిన పసిడి, వెండి

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతుండటంతో ఇవాళ‌ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయన్న నివేదికల నేపథ్యంలో మదుపరులు విలువైన లోహాల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు పరుగులు పెట్టాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఈరోజు ఉదయం 10:26 గంటల సమయానికి ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4% (రూ. 5,658) పెరిగి 10 గ్రాములకు రూ. 1,44,570 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కాస్త తగ్గి రూ. 1,44,410 వద్ద ట్రేడ్ అయింది. అలాగే, మే 5 సిల్వర్ ఫ్యూచర్స్ ధర కూడా దాదాపు 6 శాతం (రూ. 13,228) ఎగబాకి, కిలోకు రూ. 2,14,500 గరిష్ఠ‌ స్థాయికి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే ధోరణి కనిపించింది. కామెక్స్ (COMEX) గోల్డ్ ధర 4.48 శాతం పెరిగి ఔన్సుకు 4,633.17 డాలర్లకు చేరగా, కామెక్స్ వెండి 7.5 శాతం లాభపడి 74.8 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ధరల పెరుగుదలకు కారణాలు అమెరికా ప్రభుత్వం ఇరాన్‌కు 15 పాయింట్లతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించినట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ ప్రతిపాదనను ఇరాన్‌కు పంపినట్లు సమాచారం. దీనిపై చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు పాకిస్థాన్ ముందుకొచ్చింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక చర్యను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ చర్చల వార్తలను ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్-బఘేర్ ఘలీబాఫ్ తోసిపుచ్చారు.


More Telugu News