Giriraj Singh: ఒవైసీకి రెండు ముఖాలు.. పార్లమెంటులో ఒకటి, బయట మరొకటి: గిరిరాజ్ సింగ్

Giriraj Singh Slams Owaisi Double Standards
షార్ట్స్‌లో చూడండి
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి రెండు ముఖాలు ఉన్నాయని, ఆయన పార్లమెంటులో ఒకలా, బయట మరోలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఒవైసీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు.

"పార్లమెంటులో రాజ్యాంగం, చట్టం గురించి మాట్లాడే ఒవైసీ, బయటకు రాగానే అక్బర్, బాబర్ వంటి వారి అజెండాను భుజానకెత్తుకుంటున్నారు. భారత్‌లో షరియా చట్టాలను ఎప్పుడు అమలు చేయాలన్నదే ఆయన లక్ష్యం" అని గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.

రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఒవైసీ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై 2025 డిసెంబరులో 'ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ' (ఏజేయూపీ)ని స్థాపించిన హుమాయున్ కబీర్‌తో కలిసి ఎంఐఎం కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ పరిణామం రాష్ట్రంలోని మైనారిటీ రాజకీయ శక్తులను ఏకం చేసే కీలక ప్రయత్నంగా భావిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌లోని దారుస్సలాంలో జరిగిన పార్టీ సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో బెంగాలీ ముస్లింలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఆమె ప్రభుత్వంలో కనీసం 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేశారని విమర్శించారు.

ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై గిరిరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. "ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ వైపు ఆశగా చూస్తోంది. ప్రపంచ దేశాల విశ్వాసం మోదీపైనే ఉంది. ఆయన దేశాన్ని, పరిస్థితులను సీరియస్‌గా తీసుకుని అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రతిపక్ష నేతలా గందరగోళం సృష్టించడం లేదు" అని అన్నారు.
Go Back to Shorts
Giriraj Singh
Asaduddin Owaisi
AIMIM
West Bengal Elections
Mamata Banerjee
Indian Politics
Minority Politics
Sharia Law
Narendra Modi
BJP

More Telugu News