Aryaman Birla: ఆర్సీబీ ఛైర్మన్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ ఆర్యమన్ బిర్లా?

Aryaman Birla New RCB Chairman Former Cricketer
షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం చేతులు మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం.. ఆర్సీబీని రూ.16,000 కోట్లకు పైగా (1.78 బిలియన్ డాలర్లు) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ డీల్ అనంతరం ఫ్రాంచైజీకి కొత్త ఛైర్మన్‌గా ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార్ మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, డేవిడ్ బ్లిట్జర్ నేతృత్వంలోని బోల్ట్ వెంచర్స్, అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పటివరకు యూకేకు చెందిన డయాజియో పీఎల్‌సీ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) చేతిలో ఉన్న ఆర్సీబీ 100 శాతం వాటాను ఈ బృందం సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంలో పురుషుల జట్టుతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆడుతున్న మహిళల జట్టు కూడా వుంది.

ఎవరీ ఆర్యమన్ బిర్లా?
ఫ్రాంచైజీకి కొత్త బాస్‌గా రానున్న 28 ఏళ్ల ఆర్యమన్ బిర్లా గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కేవలం ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, మాజీ క్రికెటర్ కూడా. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటారు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యమన్.. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు చేశారు. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్‌పై సాధించిన సెంచరీ కూడా ఉంది. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి ఆయన డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు.

2018 ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్యమన్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఆ ఫ్రాంచైజీ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2020 సీజన్‌కు ముందు ఆయన్ను జట్టు నుంచి విడుదల చేశారు. సరిగ్గా అదే సమయంలో 'తీవ్రమైన ఆందోళన' కారణంగా క్రికెట్‌కు తాత్కాలిక విరామం (సెబాటికల్) తీసుకుంటున్నట్లు ఆర్యమన్ ప్రకటించారు. "మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను" అని ఆయన అప్పట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆటకు దూరమైన తర్వాత కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టిన ఆర్యమన్, ప్రస్తుతం ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఈ కొనుగోలుపై ఆర్యమన్ బిర్లా స్పందిస్తూ... "ఆర్సీబీ తదుపరి వృద్ధి దశను నిర్మించడానికి ఈ భాగస్వామ్యంలో భాగం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. క్రీడలు, మీడియా, వినియోగదారుల వ్యాపారాలపై లోతైన అవగాహన ఉన్న బృందం మాది" అని తెలిపారు.
Go Back to Shorts
Aryaman Birla
RCB
Royal Challengers Bangalore
IPL
Indian Premier League
Aditya Birla Group
Cricket
WPL
Rajat Patidar
Bengal

More Telugu News