‘పెద్ది’ చిత్రీకరణలో గాయపడ్డ చరణ్.. తాజా హెల్త్ అప్‌డేట్ ఇదే!

 దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్రీకరణలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ గాయం కారణంగా చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.

షూటింగ్‌లో భాగంగా రామ్ చరణ్ కంటి సమీపంలో చిన్న గాయం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇది చాలా చిన్న గాయమని, త్వరలోనే ఆయన కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' చిత్రం నుంచి టీజర్ లేదా గ్లింప్స్ విడుదలవుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా గాయం నేపథ్యంలో ఈ అప్‌డేట్‌పై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్‌ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


More Telugu News