పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయండి: ఏపీ మంత్రి గొట్టిపాటి

రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని, వాటి అమలులో ఏమాత్రం జాప్యం తగదని ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

సచివాలయంలో నిన్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బ్రూక్ ఫీల్డ్-యాక్సిస్ వంటి సంస్థల ప్రతినిధులు, నెడ్‌క్యాప్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులపై మంత్రి ఆరా తీశారు. ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యలను తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని పెట్టుబడిదారులకు సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని గొట్టిపాటి తెలిపారు. రాయలసీమలో ఏర్పాటు చేస్తున్న సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాన్ని 'బ్యాటరీ స్టోరేజ్ క్యాపిటల్'గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుల పురోగతిపై ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
 


More Telugu News