రాజ్యసభలో రాజమండ్రి కల్తీపాల అంశాన్ని లేవనెత్తిన వైవీ సుబ్బారెడ్డి
రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలో కల్తీ పాలు తాగి ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన, ఒకవైపు దేశం 'శ్వేత విప్లవం'తో పాల ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తుంటే, మరోవైపు ఇలా కల్తీ మాఫియా సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తీసుకున్న వారిలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని సుబ్బారెడ్డి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ. 10 లక్షల నష్టపరిహారం అందించాలని, అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేపట్టి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపాలని సూచించారు.