Rachamallu Sivaprasad Reddy: షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల చేస్తున్న విమర్శలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. వివేకానంద రెడ్డి మరణం తర్వాత అది 'గుండెపోటు' అని ప్రచారం చేయడంలో జగన్ హస్తం ఉందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
వివేకా మరణించిన సమయంలో అది గుండెపోటు అని కేవలం సాక్షిలోనే కాదు, 'ఎల్లో మీడియా'లో కూడా వార్తలు వచ్చాయని రాచమల్లు గుర్తు చేశారు. ఎల్లో మీడియా గురించి షర్మిల ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. వివేకా మరణం గురించి ఆయన బావమరిది శివప్రకాశ్ రెడ్డి అందరికీ ఫోన్ చేసి చెప్పారని, ఆ తర్వాతే మీడియాలో వార్తలు వచ్చాయని వివరించారు.
సంస్కారం, కుటుంబ గౌరవం కోసమే జగన్ ఇప్పటికీ ఈ అంశాలపై మౌనంగా ఉన్నారని, అది ఆయన చేతకానితనం కాదని రాచమల్లు పేర్కొన్నారు. దమ్ము, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ జగన్ అని ఆయన కొనియాడారు. తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, వాస్తవాలను గ్రహించాలని షర్మిలకు హితవు పలికారు.