వికారాబాద్ జిల్లాలోని రూప్ సింగ్ తాండాలో ఈ తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్ రమణి బాయి, ఆమె కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనార్ సింగ్ అనే వ్యక్తి అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో, ఆ కుటుంబం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది.
తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో అనార్ సింగ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ మంటల్లో సర్పంచ్ రమణి బాయితో పాటు ఆమె భర్త హన్మంత్ నాయక్, కుమారుడు వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. మరో కుమారుడు శివకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఆస్తి తగాదాల వల్లే అనార్ సింగ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వీరి మధ్య వివాదాలు నడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.