RDT Anantapur: అనంతపురం ఆర్డీటీకి తొలగిన అడ్డంకులు.. ఫలించిన చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నాలు
అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) కు కేంద్ర హోంశాఖ భారీ ఊరటనిచ్చింది. విదేశీ నిధులు పొందేందుకు అవసరమైన ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) అనుమతులను కేంద్రం పునరుద్ధరించింది. సుమారు ఏడాది కాలంగా ఈ నిధుల వినియోగంపై ఉన్న ఆంక్షల వల్ల ఆర్డీటీ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలకు అంతరాయం కలగగా, ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఈ సంస్థ, రాయలసీమలోని వేలాది గ్రామాల్లో పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య, వికలాంగులకు పునరావాసం కల్పిస్తోంది. విదేశీ నిధులపై ఆధారపడి నడిచే ఈ సంస్థకు అనుమతులు నిలిచిపోవడంతో వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు నిధుల ప్రవాహం మళ్లీ మొదలవ్వనుండటంతో సంస్థ కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడనున్నాయి.