అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను ఇరాన్ కచ్చితత్వంతో ఢీకొట్టడం వెనుక రష్యా ఉంది: జెలెన్‌స్కీ

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల వెనుక రష్యా హస్తం ఉందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను ఇరాన్ కచ్చితత్వంతో ఢీకొట్టడం వెనుక రష్యా ఇంటెలిజెన్స్, శాటిలైట్ డేటా (సిగ్నల్స్ ఇంటెలిజెన్స్) కీలకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి తన వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని, రష్యా చేస్తున్న ఈ 'విధ్వంసకర సాయం' వల్ల యుద్ధం మరింత కాలం కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


రష్యా తన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉపయోగించి అమెరికా యుద్ధ నౌకలు, విమానాల కదలికలను ఇరాన్‌కు చేరవేస్తోందని జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇరాన్ కు రష్యా అందిస్తున్న సహకారం వల్ల యుద్ధం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని... దీని కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ నిన్న టెలిఫోన్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను రష్యా మంత్రి ఖండించారు. అణు కేంద్రంపై దాడులు జరిగితే అది పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పై దాడులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.



More Telugu News