Donald Trump: యుద్ధ భయాలతో పసిడికి మళ్లీ రెక్కలు.. గంటల్లోనే రూ.10 వేల పెరుగుదల!

Gold price jumps Rs 10000 amid war fears
షార్ట్స్‌లో చూడండి
అంతర్జాతీయ రాజకీయాలు పసిడి మార్కెట్‌ను పట్టి కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు బంగారం ధరల్లో తీవ్రమైన ఒడుదొడుకులకు కారణమవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే బంగారం ధరలు ఆకాశాన్నంటడం, ఆ వెంటనే పాతాళానికి పడిపోవడం, మళ్లీ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను, వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.

సోమవారం ఉదయం ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో పెట్టుబడిదారులు డాలర్ వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.36 లక్షలకు పడిపోయింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని పసిడి ప్రేమికులు ఆశించారు.

కానీ, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. సాయంత్రానికి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఇరాన్‌పై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. రాత్రి 8 గంటలకల్లా 10 గ్రాముల బంగారం ధర తిరిగి రూ.1.46 లక్షల స్థాయికి చేరింది. అంటే, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.10,000 పెరిగింది. వెండి కూడా ఇదే దారిలో పయనించి కిలో రూ.2.32 లక్షల వద్ద స్థిరపడింది.

సాధారణంగా యుద్ధ భయాలు తగ్గితే ముడి చమురు ధరలు పడిపోతాయి, బంగారం ధరలు కూడా స్థిరపడతాయి. ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు 13 శాతం మేర పతనమైనా, బంగారం ధర మాత్రం తగ్గకపోగా మళ్లీ పుంజుకోవడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితేనని వారు వివరిస్తున్నారు. దాడుల వాయిదా తాత్కాలికమేనని, ద్రవ్యోల్బణ భయాలు ఇంకా తొలగిపోలేదని భావించిన ఇన్వెస్టర్లు, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపే మళ్లీ మొగ్గు చూపారు.

తాజా సమాచారం ప్రకారం ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదనడానికి ఇది సంకేతమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని ట్రేడింగ్ ఎకనామిక్స్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Go Back to Shorts
Donald Trump
Gold price
Gold rate today
Iran war
Hyderabad bullion market
Gold investments
Stock market
Commodity market
US Iran tensions
Global economy

More Telugu News