రణవీర్ సింగ్ విశ్వరూపం.. రికార్డులను తుడిచిపెడుతున్న 'ధురంధర్'

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. యువ నటుడు రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, రంజాన్ సెలవులను అందిపుచ్చుకుని కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా రణవీర్ సింగ్ నటన, ఆదిత్య ధర్ మేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం కూడా సినిమా స్థాయిని పెంచింది. ఈ చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం ముందు పాత రికార్డులు కొట్టుకుపోతున్నాయి. 'గదర్-2', 'జైలర్', 'సలార్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను 'ధురంధర్' కేవలం నాలుగు రోజుల్లోనే దాటేయడం విశేషం. ఆదివారం ఒక్కరోజే భారత్‌లో రూ. 114 కోట్లు వసూలు చేయడం దీని జోరుకు నిదర్శనం.

తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం ఈ చిత్రం సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద తన పట్టు నిలుపుకుంది. సాక్‌నిల్క్ (Sacnilk) రిపోర్ట్ ప్రకారం పనిదినాల్లోనూ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో, బుధవారానికల్లా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రణవీర్ సింగ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇదే ఊపు కొనసాగితే, భారతీయ సినిమా చరిత్రలో టాప్-5 చిత్రాల సరసన నిలవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


More Telugu News