విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 10 నిమిషాల్లో పని పూర్తికావడంపై హీరో గోపీచంద్ ఆశ్చర్యం

ప్రముఖ సినీ నటుడు గోపీచంద్ సోమవారం విశాఖపట్నంలో సందడి చేశారు. ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ పని మీద గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన ఆయన, ప్రభుత్వ సేవల వేగంపై ప్రశంసలు కురిపించారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రాగా, కేవలం పది నిమిషాల్లోనే తన పని పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు.

విశాఖ జిల్లా, షీలా నగర్‌లోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గోపీచంద్ తన వ్యక్తిగత పని మీద వచ్చారు. మింది సమీపంలో తనకు చెందిన స్థలాన్ని డెవలప్‌మెంట్ కోసం మరొకరితో చేసుకున్న ఒప్పందాన్ని రిజిస్టర్ చేయించడానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కేవలం 10 నిమిషాల్లోనే బయోమెట్రిక్‌తో సహా అన్ని పనులు వేగంగా పూర్తయ్యాయి. ఇక్కడి సిబ్బంది పనితీరు చాలా బాగుంది" అని మెచ్చుకున్నారు.

అంతకుముందు, కార్యాలయానికి వచ్చిన గోపీచంద్‌కు సబ్ రిజిస్ట్రార్ తారకేశు, ఇతర సిబ్బంది పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తమ అభిమాన నటుడు కార్యాలయానికి రావడంతో అక్కడ ఉన్న ప్రజలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.


More Telugu News