ట్రంప్‌తో మేం చర్చలు జరపలేదు... చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు: ఇరాన్ ప్రకటన

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌తో తాము ఎలాంటి చర్చలూ జరపలేదని, తమ హెచ్చరికలతోనే ఆయన వెనక్కి తగ్గారని స్పష్టం చేసింది. చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు అని విమర్శించింది. యుద్ధ నివారణ కోసం గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని, అయితే తాము చర్చల ప్రతిపాదను తిరస్కరించామని ఇరాన్ స్పష్టం చేసింది. అసలు చొరవ తీసుకోవాల్సిందీ, యుద్ధ విరమణ ప్రతిపాదన చేయాల్సిందీ యుద్ధం ప్రారంభించిన దేశం (ఇజ్రాయెల్) అని ఇరాన్ ఉద్ఘాటించింది. 

ఇవాళ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక ప్రకటన చేశారు. "గత రెండు రోజులుగా ఇరాన్‌తో జరిపిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. అందుకే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని రక్షణ శాఖను ఆదేశించాను. ఈ చర్చల ఫలితాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి" అని ఆయన పేర్కొన్నారు.

అయితే, ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఇరాన్ దీనిపై ఘాటుగా స్పందించింది. అమెరికాతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంప్రదింపులు జరగలేదని ఇరాన్ అధికారిక మీడియా వర్గాలు తేల్చిచెప్పాయి. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. తమ హెచ్చరికల కారణంగానే ట్రంప్ వెనక్కి తగ్గారని, తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికే చర్చల నాటకం ఆడుతున్నారని ఇరాన్ వర్గాలు ఆరోపించాయి.

గతంలో విధించిన 48 గంటల గడువు ముగుస్తుండటంతో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతుండగా, మరోవైపు ఇరాన్ ఖండిస్తుండటంతో గందరగోళం నెలకొంది. మరోవైపు, ట్రంప్ ప్రకటన ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి.




More Telugu News