వివాహేతర సంబంధం.. 18 మంది పిల్లల తండ్రి దారుణ హత్య!

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా అదృశ్యమైన సుమేర్‌పూర్ గ్రామ మాజీ సర్పంచ్ ముస్తకా గుల్షన్ అలియాస్ మున్నా (55) హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో పోలీసులు ఒక మహిళ సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం, బ్లాక్‌మెయిలే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వివరాల్లోకి వెళితే... ఇప్పటికే ఇద్దరు భార్యలు, 18 మంది పిల్లలు ఉన్న మున్నాకు, అదే గ్రామంలో ఉంటున్న సుమన్ దేవి అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త పని కోసం ఊరు విడిచి వెళ్లడంతో ఆమెకు సహాయం చేసే నెపంతో మున్నా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆమెను బలవంతంగా లోబరుచుకుని సంబంధం కొనసాగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తనను కలవాలంటూ బ్లాక్‌మెయిల్ చేసి, తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.

ఈ వేధింపులు భరించలేకపోయిన సుమన్, తన సోదరుడికి విషయం చెప్పి మున్నాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం ఈ నెల‌ 18న సుమన్.. మున్నాను తన పుట్టింటికి ఆహ్వానించింది. అతను రాగానే, అక్కడ మాటువేసిన ఆమె సోదరుడు, అతని స్నేహితులు ఇనుప రాడ్లతో మున్నాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి సమీపంలోని కాలువలో పడేశారు.

మున్నా కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ముందుగా మున్నా మోటార్‌సైకిల్‌ను గుర్తించారు. అతని ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా సుమన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఆదివారం నాడు కాలువలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సుమన్, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, హత్యలో పాలుపంచుకున్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. రానున్న గ్రామ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మున్నా సిద్ధమవుతున్నట్లు స్థానికులు తెలిపారు. అంతలోనే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు.


More Telugu News