Revanth Reddy: హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి
పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగరాన్ని మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నట్లు వెల్లడించారు. క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా ఈ ప్రణాళిక సాగనుంది. నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలన్నింటినీ వెలుపలికి తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా అండర్‌పాస్‌లు, సర్ఫేస్ రోడ్లు మరియు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం తెలిపారు. ముఖ్యంగా శామీర్‌పేట, మేడ్చల్ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక కారిడార్లు నిర్మిస్తామని, దీని కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మాట్లాడి భూసేకరణ చేస్తున్నామని పేర్కొన్నారు. మెట్రో రైలు విస్తరణకు ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వమే రూ.15 వేల కోట్లు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకుందని, త్వరలోనే మరో 76 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరిస్తామని భరోసా ఇచ్చారు.
నగర సుందరీకరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవనంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరిస్తే మూసీ సుందరీకరణ వేగంగా పూర్తవుతుందని రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే 30 వేల ఎకరాల్లో అత్యాధునిక 'ఫ్యూచర్ సిటీ'ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, గతంలో గుజరాత్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ఎలాగైతే కలిశాయో, హైదరాబాద్ అభివృద్ధి కోసం కూడా ప్రతిపక్షాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.