50 రోజుల తర్వాత ఇంటికి చేరిన కారు.. ప్రభుత్వంపై అంబటి రాంబాబు సెటైర్లు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఎట్టకేలకు ఊరట లభించింది. సుమారు 50 రోజుల తర్వాత పోలీసులు సీజ్ చేసిన ఆయన కారు తిరిగి ఇంటికి చేరింది. అయితే, ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కారును ధ్వంసం చేసిన వారిని ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్‌లో ఉంచలేదని, కానీ తన కారును మాత్రం 50 రోజులుగా సీజ్ చేశారని ఆరోపించారు.

కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు గుంటూరులోని ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఇంటి ఆవరణలో ఉన్న కార్లు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. ఆ సమయంలో పోలీసులు అంబటి రాంబాబును అదుపులోకి తీసుకుని, ఆయన కారును కూడా సీజ్ చేశారు. అయితే, తన ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ అయిన వారికి పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని అంబటి ఆరోపించారు.

వాస్తవానికి ఈ వివాదం గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీతో మొదలైంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్నారంటూ వైఎస్ జగన్‌ను విమర్శిస్తూ ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిని తొలగించేందుకు అంబటి రాంబాబు ప్రయత్నించగా, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా నమోదైన కేసులో ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.

తాజాగా కోర్టు ఆదేశాల మేరకు 50 రోజుల తర్వాత పోలీసులు ఆయన కారును విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందిస్తూ... "ఎట్టకేలకు 50 రోజుల తర్వాత కారు ఇంటికి వచ్చింది. కానీ కారును పగలగొట్టిన వారిని ఒక్కరోజు కూడా స్టేషన్‌లో పెట్టలేదు. ఇదీ చంద్రబాబు, నారా లోకేశ్ పాలన" అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.




More Telugu News