Iran Crisis: ఇరాన్ సంక్షోభం ఎఫెక్ట్.. గ్యాస్ సిలిండర్‌లో ఇక 10 కిలోలేనా?

Iran Crisis Impact LPG Cylinder May Now Be 10 Kilos
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌లో కొనసాగుతున్న సంక్షోభం ప్రభావం భారతీయుల వంటగదిపై పడనుంది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్‌పీజీ దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. దీంతో దేశంలో గ్యాస్ నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ తీవ్ర కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్లలో ఇకపై 10 కిలోల గ్యాస్‌ను మాత్రమే నింపి వినియోగదారులకు అందించే అవకాశాన్ని అన్వేషిస్తున్నాయి. ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ నిర్ణయంతో పరిమితంగా ఉన్న గ్యాస్ నిల్వలను ఎక్కువ కుటుంబాలకు పంపిణీ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

సాధారణంగా 14.2 కిలోల సిలిండర్ ఒక సగటు కుటుంబానికి 35 నుంచి 40 రోజుల వరకు వస్తుంది. అదే 10 కిలోల గ్యాస్ అయితే దాదాపు నెల రోజులు సరిపోతుంది. దీనివల్ల ప్రస్తుత నిల్వలతోనే ఎక్కువ ఇళ్లకు సరఫరా కొనసాగించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఈ మార్పు అంత సులభం కాదు. బాట్లింగ్ ప్లాంట్లలోని యంత్రాలను కొత్త బరువుకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. కొన్ని నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు కూడా అవసరం. దీనికి తోడు సిలిండర్ బరువును తగ్గిస్తే ప్రజల్లో గందరగోళం, నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని, త్వరలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇది రాజకీయంగా ఇబ్బందులు సృష్టించవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కానీ, రాబోయే రోజుల్లో సరఫరా పరిస్థితి మరింత దిగజారితే గ్యాస్‌ను ఆదా చేయడానికి ఇది తప్ప మరో మార్గం ఉండకపోవచ్చని నివేదిక పేర్కొంది.

మరోవైపు వాణిజ్య వినియోగదారులకు పాక్షికంగా సరఫరా పునరుద్ధరించడంతో నిల్వలపై మరింత భారం పడింది. ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రజలు గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ సూచించారు.

భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపై ఆధారపడగా, సంక్షోభానికి ముందు గల్ఫ్ దేశాల నుంచే 90 శాతం సరఫరా జరిగేది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో 20 శాతం వాటా ఉన్న హ‌ర్మూజ్ జలసంధిని ఇరాన్ తన శత్రు దేశాల నౌకలకు మాత్రమే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటున్నామని, ఇతరులను అనుమతిస్తున్నామని ఇరాన్ తెలిపింది. ఇప్పటికే కొన్ని భారత నౌకలు జలసంధిని దాటగా, మరో ఆరు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లు అనుమతి కోసం పెర్షియన్ గల్ఫ్‌లో వేచి చూస్తున్నాయి.

ఈ సంక్షోభంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 48 గంటల్లోగా హ‌ర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తమ విద్యుత్ ప్లాంట్లపై దాడి జరిగితే జలసంధిని పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ భారత్‌లో గ్యాస్ సరఫరా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Go Back to Shorts
Iran Crisis
LPG Cylinder
Gas Cylinder
Iran
Hormuz Strait
Sujata Sharma
Donald Trump
Gas shortage
LPG imports

More Telugu News