తిరుమలలో పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం

తిరుమల శ్రీవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మార్చి 22వ తేదీ ఆదివారం ఒక్కరోజే 86,091 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సోమవారం వెల్లడించింది.

భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఆదివారం ఒక్కరోజే శ్రీవారికి రూ. 4.21 కోట్ల కానుకలు హుండీ ద్వారా సమకూరాయి. అదే సమయంలో 29,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం టైమ్‌స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. కొండపై భారీ రద్దీ నెలకొనడంతో, కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు బయట శిలాతోరణం వరకు విస్తరించాయి. 

శనివారంతో (మార్చి 21) పోలిస్తే ఆదివారం భక్తుల సంఖ్య, ఆదాయం రెండూ పెరిగాయి. శనివారం 77,864 మంది భక్తులు దర్శనం చేసుకోగా, రూ. 3.33 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా, తిరుమలలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.


More Telugu News