హార్దిక్ కెప్టెన్సీ వదులుకోవాలి.. సూర్యకు అప్పగించాలి: కృష్ణమాచారి శ్రీకాంత్

ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టులో కెప్టెన్సీ వివాదానికి తెరపడేలా కనిపించడం లేదు. 2024 సీజన్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంపై మొదలైన చర్చ, 2026 సీజన్‌కు ముందు కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా స్వయంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని, ఇటీవలే భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్‌కు నాయకత్వం అప్పగించాలని సూచించాడు.

2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకుంది. వచ్చిన వెంటనే ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మను కాదని హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ సీజన్‌లో జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలవడంతో విమర్శలు మరింత పెరిగాయి. 2025లో జట్టు ప్రదర్శన మెరుగుపడి ప్లేఆఫ్స్‌కు చేరినప్పటికీ, ట్రోఫీ గెలవకపోవడంతో కెప్టెన్సీ మార్పుపై చర్చ అలాగే ఉంది.

ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్, ముంబై జట్టులోని పరిస్థితిని విచిత్రమైనదిగా అభివర్ణించాడు. "ముంబై యాజమాన్యం, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అందరూ కలిసి కూర్చుని జట్టు భవిష్యత్తుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరు టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్లు (రోహిత్, సూర్య) హార్దిక్ కింద ఆడటం ఆశ్చర్యంగా ఉంది. ఈసారి సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించి, జట్టు అదృష్టం ఏమైనా మారుతుందేమో చూడాలి" అని శ్రీకాంత్ విశ్లేషించాడు.

ఈ సమస్యకు హార్దిక్ పాండ్యానే పరిష్కారం చూపవచ్చని శ్రీకాంత్ అన్నాడు. "ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో హార్దిక్.. రోహిత్, సూర్యల నాయకత్వంలో ఆడి జట్టు గెలుపులో పాలుపంచుకున్నాడు. కాబట్టి హార్దిక్ స్వయంగా ముందుకు వచ్చి, 'ఈసారి కెప్టెన్సీ నాకు వద్దు, సూర్యను కెప్టెన్‌గా చేయండి, నేను అతడికి పూర్తి మద్దతు ఇస్తాను' అని యాజమాన్యానికి చెబితే ఈ వివాదం సద్దుమణుగుతుంది. ఇది సమస్యను పరిష్కరించే ఒక మంచి మార్గం" అని శ్రీకాంత్ వివరించాడు. ఫ్రాంచైజీ అంతర్గత విధానాలు ఎలా ఉన్నా, బయటి నుంచి చూసేవారికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా సరైన ఎంపిక అనిపిస్తోందని ఆయన స్పష్టం చేశాడు.
 


More Telugu News