తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపు.. పలుచోట్ల నేతల అరెస్ట్
- ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
- విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని విమర్శ
- అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నేతలు మండిపడ్డారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు నామమాత్రపు కేటాయింపులు చేసి, కీలకమైన ఈ రంగాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు.
ముఖ్యంగా భాగ్యనగర అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు తగినన్ని నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతోందని కమలనాథులు విమర్శించారు. బీజేపీ పిలుపుతో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.