వెయ్యి రూపాయల వాచీ కోసం గ్యాంగ్ వార్.. కత్తులతో వీధుల్లో హల్‌చల్

గుజరాత్‌లోని సూరత్‌లో అత్యంత విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం వెయ్యి రూపాయల విలువైన చేతి గడియారం కోసం ఆరుగురు యువకులు కత్తులు, మారణాయుధాలతో హల్‌చల్ చేశారు. గ్యాంగ్ వార్ తరహాలో వీరు రోడ్లపై తిరుగుతున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు.

ఓ వ్యక్తి తన స్నేహితుడి వద్ద ఉన్న రూ.1000 విలువైన వాచీని తిరిగి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మరో ఐదుగురు స్నేహితులను పోగేసి, కత్తులు వంటి ఆయుధాలతో వాహనాలపై బయలుదేరాడు. అయితే, వీరు ఆయుధాలతో నగర వీధుల్లో వెళ్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు.

సినిమా ఫక్కీలో ఛేజింగ్ ప్రారంభించిన పోలీసులు నిందితులు గమ్యస్థానానికి చేరుకోకముందే మార్గమధ్యంలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరికి పాత నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. వీరిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలు ఆయుధాలతో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


More Telugu News