పవన్ డబుల్ ధమాకా.. ఒకవైపు పొలిటికల్ థ్రిల్లర్.. మరోవైపు కమర్షియల్ ఎంటర్‌టైనర్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుండటంతో పవన్ తన తదుపరి చిత్రాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన 33వ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. విభిన్నమైన చిత్రాల దర్శకుడు దేవా కట్టాతో పవన్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.

‘ప్రస్థానం’, ‘ఆటో నగర్ సూర్య’, ‘రిపబ్లిక్’ వంటి సీరియస్, వాస్తవిక కథాంశాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దేవా కట్టా, ఈసారి పవన్ కోసం ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ రాజకీయ సిద్ధాంతాలు, ఆయన ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కథ లాక్ అవ్వగా, ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో దిట్ట అయిన దేవా కట్టా దర్శకత్వంలో పవన్ నటించనున్నారనే వార్త అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

ఇదిలా ఉంటే... పవన్ కల్యాణ్ మరోవైపు స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ భారీ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదొక పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ ఈ రెండు ప్రాజెక్టులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఒకవైపు తన రాజకీయ భావజాలాన్ని ప్రతిబింబించే సీరియస్ పొలిటికల్ డ్రామా, మరోవైపు మాస్ అభిమానులను అలరించే పక్కా కమర్షియల్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇచ్చిన విజయంతో పవన్ రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విభిన్నమైన కాంబినేషన్స్‌పై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.


More Telugu News